Thursday, November 12, 2009

అనుకున్నవే వచ్చాయి....

డియర్ స్టూడెంట్స్-

క్లాసులలో నేను ఇచ్చిన మెటీరియల్, పరీక్షలకు ముందు
ప్రత్యేకంగా నిర్వహించిన తరగతుల్లో చర్చించిన ప్రశ్నలు, ఇంకా... ఎప్పటికప్పుడు
క్లాసులలో నేను చెప్పిన అంశాలు ఈ ఏడాది ఐఏఎస్ తెలుగు ప్రశ్నాపత్రంలో వచ్చాయి.
వాటిని మీరంతా గమనించవచ్చు. గత మూడేళ్ళతో పోల్చుకుంటే ఈ ఏడాది తెలుగు పేపర్ ముందుగా
ఊహించిన ప్రకారం వచ్చింది. ఒక చక్కని మార్గదర్శకత్వంతో ప్రిపేర్ అయితే మంచి
స్కోరింగ్ చెయ్యవచ్చు అనుకునేలా ఈ పేపర్ ఉంది. మన విద్యార్థులు అంతా సంతృప్తికరంగా
సమాధానాలు రాసినందుకు ఆనందంగా ఉంది. ఈ ప్రశ్నాపత్రాన్ని మన బ్లాగులో పెట్టాం.
మీరందరూ చూడవచ్చు.

మీ

ఆకెళ్ల రాఘవేంద్ర

Sunday, November 1, 2009

ఐఏఎస్ పరీక్ష అక్టోబర్ 31 పేపర్-1

సమయం 3 గంటలు - గరిష్ఠ మార్కులు 300

సెక్షన్ - ఎ

1. ఈ క్రిందివాటిలో మూడింటిని గురించి వ్రాయండి. 3 X 20 = 60 మార్కులు

(a) తెలుగు క్రియాపదాల చరిత్ర

(b) తెలుగు మాండలికాలు - భేదసాదృశ్యాలు

(c) తెలుగులో అన్యదేశ్యాలు వర్గీకరణ

(d) ఆధునిక సాహిత్యం - కవిత్వానువాదాలు, సమస్యలు.

2. భారతదేశంలో భాషా కుటుంబాలు - సంక్షిప్త పరిచయం. 60

3. ప్రకావ్య భాషగా తెలుగు - సమీక్ష. 60

4. తెలుగు భాష - ధ్వని, అర్థ విపరిణామాలు 60

సెక్షన్ - బి

5. ఈ క్రిందివాటిలో మూడింటికి సమాధానాలు వ్రాయండి. 3 X 20 = 60 మార్కులు

(a) శతకవాఙ్మయం - శివకవుల సేవ

(b) ఎఱ్ఱన కవితా గుణాలు - విశిష్టత

(c) దక్షిణాంధ్ర యుగంలో కవయిత్రులు - కవితాగుణాలు

(d) దిగంబర కవిత్వం - విమర్శ ప్రతివిమర్శలు

6. తిక్కన సోమయాజి భారతాంధ్రీకరణ విధానం. 60

7. జానపద సాహిత్యం - కథాగేయాలు. 60

8. ఆధునిక సాహిత్యం - నవీన ధోరణులు. 60

ఐఏఎస్ పరీక్ష అక్టోబర్ 31 పేపర్-2

సమయం 3 గంటలు - గరిష్ఠ మార్కులు 300

సెక్షన్ - ఎ

1. క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి : -

(a) కళాసౌందర్య (Aesthetic) దృక్పథంతో విమర్శించండి : -

ఆ దుష్యంతు డనంత సత్త్వుఁడు సమస్తాశాంత మాతంగ మ
ర్యాదాలంకృత మైన భూవలయ మాత్మాయత్త మై యుండఁగా
నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో
నాదిక్షత్త్ర చరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్.

(b) పాత్ర మనస్తత్వానుగుణ (Psychological) దృక్పథంతో విమర్శించండి : -

ఈ వెండ్రుకలు పట్టి యీడ్చిన యాచేయి
తొలుతగాఁ, బోరిలో దుస్ససేను
తనువింతలింతలు దునియలై చెదరి రూ
పతియున్నఁ గని యుడుకాఱుఁగాక !
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చేయిది;
పెనుగద పట్టిన భీమసేను
బాహుబలంబును, బాటించి గాఁడేవ
మను నొక విల్లెప్పుడును వహించు
కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే ? యిట్లు బ
న్నములు వడిన ధర్మనందనుండు
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ
గానఁ బడయనైతిమేనిఁ గృష్ణఁ !

(c) చారిత్రక సామాజిక (Historical and Socialogical) దృక్పథంతో విమర్శించండి : -

దరిసెనం బిచ్చె నెద్దానిఁ గోమటి క్రొత్త
పొడసూప నేతెంచి భూభుజునకుఁ
దనకిచ్చె నెద్దాని ధారాంబు పూర్వంబు
పుణ్యకాలము నాఁడు భూమిభర్త
తానిచ్చె నెద్దాని ధర్మగేహిని యైన
సోమిదమ్మకు మనఃప్రేమ మలరఁ
దఱిచూచి యిచ్చె నెద్దానిఁ బట్టికిఁ దల్లి
జూదమోడిన పైఁడి సుట్టికొనిన
నట్టి నవరత్న మయమైన యంగుళీయ
కంబు యజ్ఞావభృథ పుణ్యకర్మసాక్షి
వీటిలో నొక్క జూదరి వ్రేల నుండఁ
జూచెఁ గనుఱెప్ప వెట్టక సోమయాజి.

(d) నిర్మాణశిల్ప దృక్పథంతో విమర్శించండి : -
తన కీర్తి కర్పూర తతి చేత వాసించెఁ
బటుతర బ్రహ్మాండ భాండ మెల్లఁ
దన శౌర్య దీప్తిచే నినబింబ మనయంబుఁ
బగలెల్ల మాఁగుడు వడఁగఁ జేసెఁ
దన దాన విఖ్యాతి ననుదినంబును నర్థి
దారిద్ర్యములు వెళ్ళఁబారఁ దరిమెఁ
దన నీతి మహిమచే జనలోక మంతయుఁ
దగిలి సంతతమును బొగడఁ దనరెఁ
భళిర ! కొనియాడఁ బాత్రమై పరఁగినట్టి
వైరి నృపజాల మేఘ సమీరణుండు
దినకరాన్వయ పాథోధి వనజవైరి
నిశిత కౌక్షేయక కరుండు దశరథుండు.

2. శ్రీకృష్ణుని రాయబారాన్ని చిత్రించటంలో తిక్కన ప్రదర్శించిన నాటకీయతను సోదాహరణంగా వివరించండి. 60

3. సుగాత్రీ శాలీనుల మనస్తత్వాన్ని పింగళి సూరన ఎట్లా చిత్రించాడో నిరూపించండి. 60

4. మొల్ల దృష్టిలో కావ్యం ఎట్లా ఉండాలో తెలిపి ఆమె రచనలో ఆమె చెప్పిన కావ్య లక్షణాలు ఎట్లా దర్శనమిస్తాయో వివరించండి. 60

సెక్షన్ - బి

5. క్రింది ప్రశ్నలలో మూడింటికి అడిగిన పద్ధతిలో మీ అభిప్రాయాలను సహేతుకంగా వివరించండి : - 3 X 20 = 60 మార్కులు

(a) కళాసౌందర్య (Aesthetic) దృక్పథంతో విమర్శించండి : -

సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజము ?
చంద్రికల నేల విరజిమ్ము చందమామ ?
ఏల సలిలంబు పారు ? గాడ్పేల విసరు ?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను ?
మావి గున్న కొమ్మను మధుమాస వేళ ?
పల్లవము మెక్కి కోయిల పాడుటేల ?
పరుల తనియించుటకొ ? తన బాగు కొరకొ ?
గాన మొనరించక బ్రతుకు గడవబోకొ ?

(b) సామాజిక (Socialogical) దృక్పథంతో విమర్శించండి : -

నిన్ను బహిష్కరించు నవనీవలయం బిది యంటరానివాఁ
డున్న నిషిద్ధగేహము సహోదరి నీవు సమస్త దేవతా
సన్నిధి నారగింతువు ప్రసాదము లంతటి పుణ్యురాలివై
యన్నము లేని పేదల గృహంబుల సొచ్చితివేల బేలవై.

(c) సైద్ధాంతిక (Ideological) దృక్పథంతో విమర్శించండి : -

కావున లోకపుట న్యాయాలూ
కాల్చే ఆకలి, కూల్చే వేదన,
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ
పాటలు వ్రాస్తూ
నాలో కదిలే నవ్య కవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి
శ్రామిక లోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా
త్రికాలాలలో, త్రిలోకాలలో
శ్రమైకజీవన సౌందర్యానికి
సమానమైనది లేనే లేదని
కష్టజీవులకు, కర్మవీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ
స్వస్తి వాక్యములు సంధానిస్తూ
స్వర్ణవాద్యములు సంరావిస్తూ
వ్యథార్త జీవిత యధార్థ దృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావి వేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్ !

(d) చారిత్రక సామాజిక (Historical and Socialogical) దృక్పథంతో విమర్శించండి : -
ఎటు చూచినను కపురపు గంధమే
ఏదెసను ఆనందమే అందమే
కర్పూర కస్తూరి
కా చందనములతో
నేలయేకాదు నిం
గియు పరిమళించినది.
జాదర జాదర జాదరయంచును
"చర్చరి గీతులు" పాడెడువారలు
ద్రుత తాళమ్మున ధుంతక ధుంతక
ధుంధుంకిటయని ఆడెడువారలు.
తుమ్మెద పదములు వెన్నెల పదములు
కమ్మగ గానము చేసెడువారలు
ఏలలు పాడుచు ఈలలు వేయుచు
సోలుచు తూలుచు పోయెడువారలు
ఝల్లరి జర్ఝరి మోదెడువారలు
వల్లకి వంశిక మ్రోసెడివారలు
డమరువులను మ్రోగించుచు బల్ ఫీ
ట్కారమ్ములతో తూగెడువారలు
దేశి మార్గముల నృత్తనృత్యముల
తీరులు చూపుచు పోయెడువారలు.

6. అల్పజీవి నవలలో రచయిత చేసిన సుబ్బయ్య మనస్తత్వ చిత్రణను సమీక్షించండి. 60

7. ఎన్.జీ.ఓ. నాటకంలో ఆత్రేయ మధ్యతరగతి కుటుంబ జీవనాన్ని చిత్రించిన విధానాన్ని వివరించండి. 60

8. కృష్ణపక్షం ఆధారంగా దేవులపల్లివారిని భావ కవిత్వోద్యమానికి సారథిగా నిరూపించండి. 60