Wednesday, September 9, 2009

ఐఎఎస్ పరీక్షకు కావల్సిందిది!

(ఐఎఎస్ ఆశావహుల కోసం నేను రచించిన "ఐఎఎస్ తెలుగు లిటరేచర్ పేపర్-2" పై జౌన్‌పూర్ (ఉత్తరప్రదేశ్)లో జాయింట్ మేజిస్ట్రేట్‌గా సేవలందిస్తున్న ఎ.వి.రాజమౌళి, ఐఎఎస్‌గారి సమీక్ష)

ఇటీవలి కాలంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలలో తెలుగు సాహిత్యం ఆప్షనల్‌గా తీసుకొనే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మాతృభాష తెలుగు కావడం, పరీక్షకు అవసరమైన పాఠ్య సామగ్రి, బోధనా నిపుణులు సమృద్ధిగా అందుబాటులో ఉండడం, కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివిన అభ్యర్థులకు ఆశాజనక ఫలితాలు రావడం - ఈ పరిణామానికి ప్రధాన కారణాలు. తెలుగు సాహిత్యం పేపర్-2 సిలబస్‌పై ఇంతకు ముందు కొన్ని పుస్తకాలు వెలువడినా - అవి బోధనా నిపుణుల దృక్కోణం నుంచే రాయబడ్డాయే కాని అభ్యర్థులు ఎదుర్కొనే సమస్యల దృక్కోణం నుంచి రాయబడినట్లుగా అనిపించవు. సివిల్ సర్వీసెస్ పరీక్షల అవసరాలను పూర్వ అభ్యర్థిగా స్వానుభవంతో తెలుసుకొన్న వారు, సివిల్స్ మెయిన్స్ పరీక్షలలో తెలుగు సాహిత్యంలో మంచి మార్కులు (392) సంపాదించినవారు, బోధనా నైపుణ్యాన్ని స్వతఃసిద్ధంగా కలిగి ఉన్న మిత్రులు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు. యు.పి.ఎస్.సి. అభ్యర్థులకు ఒకే పుస్తకంలో పాఠ్యభాగ సారాంశాన్ని పద్యాల వ్యాఖ్యానాలను, కొన్ని ముఖ్య ప్రశ్నలకు సమాధానాల్ని, వీటితోపాటు మరికొన్ని ప్రశ్నలను జోడించి సిలబస్‌లో ఉన్న ప్రతి పాఠ్యభాగ అంశానికీ సంతృప్తికరంగా న్యాయం చేస్తూ రాఘవేంద్రగారు రాసిన పుస్తకం ఇది.

ఏ పాఠ్యభాగ విషయాన్ని (Content) అయినా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే సంబంధిత పాఠ్యభాగం రచించబడ్డ దేశకాల పరిస్థితులను, ఆ రచయిత కవితా లక్షణాలను, ఆ రచయిత పాఠ్యభాగాన్ని రచించిన సందర్భాన్ని (Context) స్థూలంగా ఆకళింపు చేసుకోవాల్సి ఉంటుంది. పాఠ్య భాగ సారాంశం అవగతమైన తర్వాత మూల పాఠ్య భాగాన్ని (Original Text) చదివితే అందులోని పద్యాల సారాంశాన్ని సందర్భోచితంగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా పరిశ్రమ చేస్తే పద్యాలకు వ్యాఖ్యానం రాయడం అభ్యర్థులకు సులభ సాధ్యం అవుతుంది. ప్రతి పాఠ్యభాగ ప్రారంభంలో రాఘవేంద్రగారు ఇచ్చిన సారాంశం, అలాగే ఎంచుకున్న పద్యాలకు ఇవ్వబడ్డ వ్యాఖ్యానాలు పరిశీలిస్తే పైన పేర్కొన్న అంశాల విషయంలో ఈ రచయిత పడ్డ శ్రమకు, స్వానుభవానికి అవి దర్పణంగా నిలుస్తాయి. ముఖ్యంగా వ్యాఖ్యానాలను రచయిత ఎంతో విపులంగా వివరించారు. అయితే వ్యాఖ్యానాల నిడివి విషయంలో అభ్యర్థులు సమయానుకూలంగా క్లుప్తీకరించుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులు ఎదుర్కొనే మరో సవాలు వ్యాసరూప ప్రశ్నలకు రాసే జవాబు నిర్మాణం ఎలా ఉండాలి అన్నది. మన రాష్ట్రం నుంచి యు.పి.ఎస్.సి. పరీక్ష రాసే అభ్యర్థులు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు రాసి ప్రాక్టీసు చేసే విషయంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ అలసత్వమే మెయిన్స్ పరీక్షలలో వీరు ఆశించిన రీతిలో రాణించలేకపోవడానికి కారణం. అభ్యర్థుల ప్రిపరేషన్‌లో ఉన్న ఈ లోటును పూడ్చడానికా అన్నట్లు ప్రతి పాఠ్య భాగానికి రచయిత పొందుపరచిన నమూనా సమాధానాలు ఎంతో సంగ్రహంగా ఉండి విషయ విశ్లేషణలోనూ, భావవ్యక్తీకరణలోనూ తమవైన శైలిలో ఉన్నాయి. విశేషమేమిటంటే ఎంతో సమగ్రమైన సమాధానాలు ఇచ్చే విధంగా ప్రశ్నలు రూపొందించి - వాటికి ఒక క్రమంలో సమాధానాలు ఇవ్వడం. ఈ సమాధానాలను చదివిన తరవాత ఎటువంటి ప్రశ్నకైనా సమాధానాన్ని రాయగలిగే ప్రాథమిక సమాచారం అభ్యర్థికి లభిస్తుంది. ఈ సమాచారానికి తోడుగా అభ్యర్థి తన సొంత విశ్లేషణను సందర్భానుసారంగా జోడిస్తే అడిగిన ప్రశ్నకు చక్కని సమాధానం తయారవుతుంది. ఈ పుస్తకంలో ఇచ్చిన నమూనా సమాధానాలను చదివి పాఠ్యాంశంలో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయటం ప్రాక్టీస్ చేస్తే అభ్యర్థుల తయారీ మరింత పరిపుష్టమవుతుంది.

ఈ పుస్తకంలో అక్కడక్కడ రాఘవేంద్ర గారిలోని కవి బయటకు తొంగి చూశాడు. ప్రతి పాఠ్యాంశం ప్రారంభంలో ఆయా కవుల / కవయిత్రులపై రచయిత వ్యక్తం చేసిన / క్లుప్తపంక్తులు ఆ కవిని / కవయిత్రిని పాఠకుడికి పరిచయం చేయడమేగాక వారి రచనా జీవిత సారాన్ని పాఠకులకు అందించేదిగా ఉంది. ఈ పంక్తుల్ని అభ్యర్థులు పరీక్షలో సమాధానాలు రాసేటప్పుడు పరిచయ (Introduction) వాక్యాలుగానో, ముగింపు వాక్యాలుగానో వాడుకోవచ్చు. తిక్కన "తానే ఒకప్పుడు ధర్మజుడై, మరొకప్పుడు కృష్ణుడై, ఇంకొకప్పుడు వ్యాసుడై జీవిత భారతాన్ని నిర్వహించాడు" అని సంగ్రహించిన ఈ రచయిత - "వేరొకప్పుడు ద్రౌపదియై..." అని చేరిస్తే నిష్పాక్షికమై నిండుగా ఉండేది (పేజి: 66). శ్రీనాధుడి గురించి ప్రస్తావిస్తూ "శ్రీనాథుడు పురాణ ప్రబంధయుగాలకు సేతువు" (పేజి: 115) అని రాఘవేంద్రగారు అన్నారు. సత్యసౌందర్య సంగ్రహమీ వాక్యం. గురజాడ (ఆణిముత్యాలు) గురించి "కథకు పురుడు పోశాడు" అన్న వాక్యం నిజంగా ఆణిముత్యమే. ఇట్టి వాక్యాలు ఈ పుస్తకంలో కోకొల్లలు. సమాధాన పత్రాల్లో ఇలాంటి వాక్యాలు వ్యాసానికి ఒక్కటి ఉంటే చాలు. అయితే ఇవన్నీ రచయిత సొంత వాక్యాలా? కానక్కర్లేదు. తేనెటీగ పూలనుండి శ్రమకోర్చి తేనెను తయారు చేస్తుంది. మైనం తయారు చేస్తుంది. మనం గమనించని మరో మహోపకారం పరపరాగ సంపర్కం. తేనెటీగకు తేనె, పువ్వుకు పరాగ సంపర్కం లాభం. ఈ రచయిత ఆ తేనెటీగలా శ్రమించినవాడు.

యు.పి.ఎస్.సి. పరీక్షలకు కావలసింది అడిగిన ప్రశ్నకు అభ్యర్థి రాసే విశ్లేషణాత్మక సమాధానం ! పదడాంబికంతో కూడిన పద్యగద్య సంకలనం కాదు. యు.పి.ఎస్.సి. పరీక్షించేది నిశిత పరిశీలన, సంయమన పూర్వక సద్విమర్శ, స్వయం సమృద్ధమైన విశ్లేషణ. ఈ వాస్తవిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని, తెలుగు సాహిత్యం పట్ల పూర్వ పరిచయం లేని అభ్యర్థులకు కూడా ఈ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకొనే ప్రోత్సాహాన్ని అందించే విధంగా రాయడమే ఈ పుస్తకానికి ఉన్న (లభ్యమవుతున్న ఇతర పుస్తకాలతో పోలిస్తే) విలక్షణత. "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" - శ్రద్ధ గల అభ్యర్థుల కోసమే ఈ పుస్తకం. అభ్యర్థి దశలో తాను పడ్డ కష్టం ఇతర అభ్యర్థులు పడకూడదన్న సదుద్దేశంతో, కొన్ని నిర్ణీత ప్రమాణాలతో అధ్యాపకుడిగా శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు రాసిన ఈ పుస్తకం సివిల్ సర్వీసెస్ పరీక్షలలో తెలుగు సాహిత్యం ఆప్షనల్‌గా ఎంచుకొన్న ప్రతి అభ్యర్థి తప్పకుండా చదవతగ్గది. ఈ సత్కార్యానికి సారథి శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు. వారధి "విజేత కాంపిటీషన్స్" వారు. ఇద్దరూ అభినందనీయులు.

మీ భాషాసేవకుడు

ఎ.వి. రాజమౌళి.

No comments:

Post a Comment