Thursday, September 10, 2009

పాత్రల మనస్తత్వ దృక్పథం

ఈ దృక్పథంలో వివిధ సందర్భాల్లో, వివిధ పరిస్థితుల్లో ఒక్కో పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో వివరించాల్సి ఉంటుంది. ఒక్కో సంఘటనకు ఒక్కో పాత్ర ఒక్కో విధంగా ప్రతిస్పందిస్తుంది. ఆ ప్రతిస్పందనకు అనుగుణంగానే ఆ పాత్ర మాట తీరు ఉంటుంది. ప్రతి కవీ తన కావ్యంలో పాత్ర పోషణలో భాగంగా ఆయా పాత్రల మనస్తత్వాల్ని, ఆ మనస్తత్వానికి అనుగుణంగా సాగే సంభాషణలను, ఆవేదనలను, ఆనందాలను తప్పక ప్రతిబింబిస్తాడు. వాటిని అవగాహన చేసుకుని వ్యాఖ్యానించడం ఇందులో భాగం.

మనో విశ్లేషణాత్మక విమర్శలో - ప్రముఖ మనస్తత్త్వ శాస్త్రజ్ఞులు ప్రతిపాదించిన మనో వైజ్ఞానిక సిద్ధాంతాల ఆధారంగా సాహిత్యాన్ని పరిశీలించి విమర్శించడం కనిపిస్తుంది. ఇది ప్రాచీన సాహిత్యం కన్నా ఆధునిక సాహిత్య వ్యాఖ్యానానికి దోహదం చేస్తుంది.

అదేవిధంగా వ్యాఖ్యానం చేసేటపుడు - కవి జీవిత కావ్య సమన్వయ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కవుల వ్యక్తిగత జీవిత పరిస్థితుల ప్రభావం, వారి మానసిక పరిస్థితులు, వారు నమ్మే సిద్ధాంతాలు, వారి రచనల్లో ఎలా ప్రతిబింబించాయో ఆలోచించే, నిరూపించే విమర్శనా పద్ధతిని అవలంబించడం ఇందులోని కీలకాంశం. కవి యొక్క మానసిక పరిస్థితి, వ్యక్తిత్వమూ అంచనా వేయడం ఇందులో ప్రధానంగా జరుగుతుంది. ఈ రెండింటి నేపథ్యంతో కవి రచన ఎలా సాగిందో విశ్లేషించబడుతుంది. ఇది మనో విశ్లేషణాత్మక విమర్శలో ఉపకరిస్తుంది.

లైంగిక పరమైన కోరికలు, జ్ఞాపకాలు మనుషుల్లో ఉంటాయని, కానీ సామాజిక కట్టుబాట్ల వల్ల అవి అణగి ఉంటాయనీ, అలా అణగి ఉన్న మానసిక స్థితిని అచేతనావస్థ అనవచ్చునని, ఈ అచేతనావస్థ ప్రభావం రచనల్లో ఎలా వ్యక్తం అవుతుందో సాహిత్య విమర్శకులు పరిశీలించవచ్చుననీ మనోవైజ్ఞానిక విశ్లేషకులు అంటారు.

రచనల్లోని పాత్రలనూ, సంఘటనలనూ మనో వైజ్ఞానిక అంశాలకు ప్రతీకలుగా మనోవైజ్ఞానిక విమర్శకులు తమ విమర్శలో వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అచేతన రెండు రకాల ప్రభావాలతో ఉంటుంది.
ఒకటి, వ్యక్తిగతంగా వ్యక్తి తను ఎదుర్కొన్న అనుభవాలతో ఏర్పడేది.

మరొకటి, సామాజికంగా అందరిలో కనిపించే, అందరికీ ఎదురయ్యే కల్పనలు, అనుభవాలు, ఉద్వేగాలు, ఆలోచనలు, భావచిత్రణలు - వంటి వాటితో ఏర్పడునటువంటి, ప్రభావితమైనటువంటి అచేతనం మరొకటి.
దీనిని సమష్టి అచేతన (Collective unconsciousness) అని అంటారు.

మనో విశ్లేషణాత్మక విమర్శ రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటి :రచనలో వివిధ సంఘటనల్లో పాత్రల ప్రవర్తనను విశ్లేషించడం.

రెండు :రచనలో ప్రత్యేక అంశాలకి, రచయిత మానసిక పరిస్థితికీ ఏమైనా సంబంధం ఉందా అని పరిశీలించి విమర్శించడం.

కణ్వ మహాముని ఆశ్రమంలో దుష్యంతుడితో మాట్లాడిన శకుంతల మనస్తత్వం ఒకలాగ, ఆస్థానానికి వెళ్ళినపుడు, దుష్యంతుడు తిరస్కరించినపుడు - మరో విధంగా ఉంటుంది. మొదటి సంఘటనలో ఆనందం, ఆశ్చర్యం లాంటి భావనలతో కూడిన మనస్తత్వం ఉంటుంది. రెండవ సంఘటనలో ఆవేదన, ఆందోళన, అసహనం, ఆవేశం లాంటి భావనలు ఉంటాయి. కాబట్టి శకుంతల ఆయా సంఘటనల్లో మాట్లాడిన మాటలు ఆయా మనస్తత్వాలకు అనుగుణంగా ఉంటుంది. వీటిని విశ్లేషిస్తూ, ఆయా పూర్వాపర సంఘటనల్ని వివరిస్తూ వ్యాఖ్యానం రాయాల్సి ఉంటుంది.
అలాగే తిక్కన మహాభారతంలోని రాయబార ఘట్టంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, శ్రీకృష్ణుడు, ద్రౌపది... మాట్లాడిన మాటల్లో వారి వారి మనస్తత్వాలు ప్రతిబింబిస్తాయి. వాటిని విద్యార్థి ఎంతబాగా అవగాహన చేసుకుంటే అంతబాగా పరీక్షలో పాత్రల మనస్తత్వ దృక్పథంతో వ్యాఖ్యానం రాయడం సాధ్యం అవుతుంది.

No comments:

Post a Comment