మౌలికంగా దృక్పథం అంటే ఏమిటో చెప్పుకోవాల్సి ఉంటుంది. కథలోని సంఘటనలను రచయిత ఎలా చూస్తాడు, ఎలా చూపుతాడూ అనేది ఆ రచయిత దృక్పథం అవుతుంది. ఇది సాధారణంగా మూడు రకాలుగా ఉంటుంది.
మొదటిది: రచయిత రచనలో పాత్రగా కాకుండా దూరంగా ఉండి పాత్రల్ని, సంఘటనల్ని వ్యాఖ్యానిస్తూ ఉంటాడు. తనకు తోచిన విధంగా ఆలోచనలను భావాల్ని ఆయా పాత్రల ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఈ రకమైన పద్ధతి ప్రాచీన కాల సాహిత్యంలో అధికంగా కనిపిస్తుంది. దీన్ని ప్రథమ పురుష దృక్కోణం అంటారు.
రెండవది: రచనలో రచయిత కూడా ఒక పాత్రగా ఉండి, నేను అంటూ తన పాత్ర స్వభావానికీ, పరిధికే లోబడి వ్యాఖ్యానిస్తాడు. అంటే ఈ చెప్పే వ్యక్తికి తనకు సంబంధించిన విషయాలు, ఆలోచనలే గాని, ఇతర పాత్రలలో దాగి ఉన్న ఆలోచనలు తెలీవు. దీన్ని ఉత్తమ పురుష దృక్కోణం అంటారు.
మూడవది: రచనలోని ఒక అప్రధాన పాత్ర, కథ చెబుతున్నట్టుగా రచనలో జరిగే సంఘటనల గురించీ పాత్రల స్వభావాన్ని గురించీ వ్యాఖ్యానిస్తూ ఉంటుంది. దీన్ని బహుళ దృక్కోణం అంటారు. ఈ చివరి రెండు దృక్కోణాలు ఆధునిక సాహిత్యంలో అధికంగా కనిపిస్తాయి. ఇలాంటి అంశాల్ని సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థి అర్థం చేసుకొంటే వివిధ వ్యాఖ్యానాల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలడు.
రచనలో ప్రతిఫలించిన అంశాలనూ, అర్థాలనూ సరియైన పద్ధతుల్లో వ్యాఖ్యానించడం "వ్యాఖ్యానం"లో మౌలిక అంశం. రచనలోని విషయాలపై వ్యాఖ్యానానికి పూనుకొన్నపుడు రచయిత ఉద్దేశాన్నీ, చారిత్రక నేపథ్యాన్ని పాఠకుల స్థాయినీ దృష్టిలో ఉంచుకొని వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది.
ఒక రచన ఒక్కో రకం - పాఠకులకు ఒక్కోసారి, ఒక్కోరకంగా అర్థం కావచ్చు. విషయం పట్ల వారికి ఉన్న అవగాహన, వారు పెరిగిన వాతావరణం, వారి అనుభవం, గ్రహించగలిగే సామర్థ్యం - ఇవన్నీ వారి వ్యాఖ్యానాల్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి రచయిత ఉద్దేశాన్ని ఖచ్చితంగా ప్రతిబింబించే వ్యాఖ్యానమే సరైన వ్యాఖ్యానం.
అసలైన వ్యాఖ్యానం చేయకపోయినా ఫర్వాలేదేమో కానీ అసందర్భ వ్యాఖ్యానం - (Anachronism) ప్రమాదకరం. రచనలో పొరపాటున గానీ, ఉద్దేశ పూర్వకంగా గానీ రచనా కాలానికి సరిపడని విషయాలను, వస్తువులను, క్రీడలను, పాత్రలను చూపడం, ప్రస్తావించడం జరగొచ్చు. వాటిని రచయిత దృక్కోణం నుంచి అర్థం చేసుకొని వ్యాఖ్యానించాలి. రామాయణ కాలంలో బుద్ధుడి పాత్రను, ప్రాచీన కవికి ఫ్రాయిడ్ సూత్రాలను అనుసరించి విశ్లేషించడం సరికాదు.
సిలబస్ ప్రకారం - అభ్యర్థి ఈ కింది నాలుగు రకాల వ్యాఖ్యానాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
1. కళాసౌందర్య (Aesthetic) దృక్పథం
2. చారిత్రక - సామాజిక (Historical and Socialogical) దృక్పథం
3. తాత్త్విక (Idealogical) దృక్పథం
4. పాత్రల మనస్తత్వానుగుణ (Psychological) దృక్పథం
దీనికి తోడు సిలబస్‌లో పేర్కొన్న రసవాద దృక్పథం, ధ్వనివాద దృక్పథం, వక్రోక్తివాద దృక్పథం, రూపనాదం, నిర్మాణవాదం, భావచిత్రవాదం, ప్రతీకవాదం లాంటి అంశాలపై కూడా అభ్యర్థి పట్టుసాధించాలి. ఈ అంశాలు కళాసౌందర్యాత్మక దృక్పథంపై రాసే వ్యాఖ్యానానికి ఉపకరిస్తాయి.
Thursday, September 10, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment