ఈ దృక్పథంలో ఒక పద్యాన్ని వ్యాఖ్యానించేటపుడు - ఆ పద్యం గల కావ్యం వెలువడినపుడు ఉన్న సామాజిక - చారిత్రక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. రచనా ప్రక్రియ ప్రారంభ వికాసాలనూ, రచనా కాలంలోని చారిత్రక విశేషాలనూ సామాజిక ప్రత్యేకతనూ ఆధారం చేసుకొని చేసే విమర్శనా విధానం ఈ వ్యాఖ్యానంలో కనిపించాలి.
సాహిత్యాన్ని చారిత్రక, సామాజిక దృక్కోణంతో వివేచించడం ఈ దృక్పథంలోని ప్రధానాంశం. సమాజానికి దూరంగా, సామాజికతను పట్టించుకోని సాహిత్యం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచిన సాహిత్యం తప్పక సామాజికతను కలిగి ఉంటుందన్నది ఇందులోని కీలకాంశం. సామాజిక పరిస్థితులు అంటే కేవలం సామాజిక విశేషాల్ని జాబితాగా రాసేయడం కాదు. సామాజిక పరిణామాన్ని గతితార్కిక చారిత్రక భౌతికవాద దృక్కోణంతో వ్యాఖ్యానించడం ప్రధానం. కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ అందించిన భావజాలం దీనికి పునాది. సంఘ చరిత్రను ఉత్పత్తి చేసే వారికీ, వారి సాధనాలకూ, ఆర్థిక వ్యవస్థకూ వినియోగదారులకు ఆయా యుగాలలో ఉండే సంబంధాల ఆధారంగా విశ్లేషించడం ఈ దృక్పథంలో కనిపిస్తుంది.
పాలకులు తమ ఫ్యూడల్ ప్రాబల్యాన్ని కాపాడుకొనేందుకు బ్రాహ్మణుల నుంచి సహాయం పొందేవారు. దానికి ప్రతిఫలంగా బ్రాహ్మణులకు అగ్రహారాల్ని భూముల్ని దానాలు ఇచ్చేవారు. బ్రాహ్మణులు 'నా విష్ణు. పృథివీపతిః' వంటి వాటిని ప్రజలకు తెలిపేవారు. నన్నయ ఫ్యూడల్ వ్యవస్థను, రాజరికాన్ని, బ్రాహ్మణ మతాన్ని, చాతుర్వర్ణ్య వ్యవస్థను సమర్థించే కవి. ఆయన భావజాలానికి ఆంధ్ర మహాభారతం దర్పణం.
క్రీ.శ. 11వ శతాబ్దంలో నన్నయ మహాభారత రచన చేసిన నాటి నుంచి ఆధునిక యుగం సాహిత్యం వరకు - ఆయా యుగాల చారిత్రక, రాజకీయ, సామాజిక మత సాహిత్య సాంస్కృతిక పరిస్థితులను ఆయా కవుల కావ్యాలు ప్రతిబింబిస్తూ వచ్చాయి. 11వ శతాబ్ది నాటికి వర్ణాశ్రమ ధర్మాలు నామమాత్రమయ్యాయి. బ్రాహ్మణాధిక్యత, పాలకుల నియంతృత్వం పెరిగాయి. బ్రాహ్మణ క్షత్రియులు ధనికవర్గంగా, పాలకవర్గంగా, ఇతర వర్గాలు పేద, పీడిత వర్గంగా ఏర్పడ్డాయి.
క్రీ.శ. 12వ శతాబ్ది నాటికి శైవ వైష్ణవ మతాలు ఫ్యూడల్ వ్యవస్థకు ఆధారభూతం అయిన చాతుర్వర్ణ్య వ్యవస్థకు వ్యతిరేకంగా భక్తి ఉద్యమాలకు ఊపిరిపోశాయి. వీరశైవులు, వైష్ణవులు మతకల్లోలాలకు, రక్తపాతాలకు ఆజ్యం పోశారు. అరాచకాన్ని, మతం పేరిట జరుగుతున్న అమానుషత్వాన్ని అరికట్టేందుకు తిక్కన 13వ శతాబ్దిలో 'హరిహరాద్వైతం' అనే భావనను ప్రతిపాదించాడు.
రచయిత జీవితమూ, అతను పెరిగిన వాతావరణమూ వీటన్నింటినీ పరిశీలించి తద్వారా ఆ రచనను అంచనా వేయడం చారిత్రక విమర్శలో భాగం - కాబట్టి ఇవ్వబడిన పద్యం వెనుక ఉన్న - సామాజిక చారిత్రక పరిస్థితులను అభ్యర్థి వివరించి ఆపై ఆ పద్యంలో ఆ సామాజిక చారిత్రక పరిస్థితులు ఎలా ప్రతిబింబించాయో క్రమంగా రాసుకుంటూ వెళ్ళాలి.
సిలబస్‌లో ఉన్న ఇతర కవులయిన శ్రీనాథుడు, పింగళి సూరన, మొల్ల, కాసుల పురుషోత్తమ కవుల కాలాల నాటి సామాజికాది పరిస్థితుల్ని అభ్యర్థి అవగతం చేసుకోవాలి. తిక్కన రాయబార ఘట్టమైనా, శ్రీనాథుడు గుణనిధి కథ అయినా, పింగళి సూరన సుగాత్రీ శాలీనుల కథ అయినా, మొల్ల రామాయణమయినా, ఆంధ్ర నాయక శతకమయినా ఆయా కాలాల నాటి సామాజిక చారిత్రకాది పరిస్థితులకు ప్రతిబింబాలు. ఆధునిక కావ్యాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
ఆ పద్యంలో ప్రతిబింబించిన ఆ కాలం నాటి ఆచార వ్యవహారాలనూ, సాంఘిక పరిస్థితులను అప్పట్లో ఉన్న సాహిత్య సిద్ధాంతాలనూ, ఆ నాటికి ఆ కావ్యమూ ఆ కావ్యంలో అలాంటి పద్యమూ రాయడానికి అవసరమైన పరిస్థితులనూ వివరించాల్సి ఉంటుంది. వీలయితే ఆ రచనలతో పాటు వెలువడిన ఆ నాటి సమకాలీన రచనలలో ఇంకా ఏవైనా విశేషాలు ఉంటే వాటిని కూడా వ్యాఖ్యానంలో ఉటంకించవచ్చు.
ఈ రకపు వ్యాఖ్యానంలో ఆ పద్యం లేదా ఆ కావ్యం పాఠకులకు కలిగించిన అనుభూతిని చర్చించడం కంటే అందులోని అందాల్ని, రచించిన శైలిని, శిల్పాన్ని తెలపడం కన్నా - పాఠకుడుకి ఆ నాటి సమాజం తాలూకు వివరాలని, ఆ సమాజంలో ఆ చారిత్రక కాలంలో ఆ రచనకు ఉన్న స్థానాన్ని విశ్లేషించాలి.
Thursday, September 10, 2009
Subscribe to:
Post Comments (Atom)
very useful source for civils ias telugu literature and other optionals.
ReplyDelete