(ఈనాడు, సోమవారం, మే 30, 2005)
రాయప్రోలు 'ఆంధ్రావళి'లోని జాతీయోద్యమం, రాష్ట్రభక్తి అనే అంశాలను మీరు చదివారు. తీరా పరీక్షలో 'ఆంధ్రావళిలోని పూర్వౌన్నత్యం, భారతీయ ప్రాచీన వైభవం'పై ప్రశ్న అడగవచ్చు. అప్పుడు 'ఆంగ్లేయుల పాలనలో ఆత్మవిశ్వాసం కోల్పోయిన భరత జాతి గత వైభవ స్మరణ చేస్తూ, ప్రాచీన వైభవాన్ని కీర్తిస్తూ తెలుగు కవి రచించిందే - జాతీయోద్యమ కవిత్వం' అంటూ ప్రారంభించి ఆపై జాతీయోద్యమ స్పూర్తిని గురించి రాయాలి.
నన్నయ కవితా లక్షణాలపై నేరుగా ప్రశ్న అడగకుండా 'తెలుగులో గురుపద్యవిద్యకు ఆద్యుడైన నన్నపార్యుని కవితా శిల్పాన్ని రాయండి' అని అడగవచ్చు. దీనికి సమాధానంగా ముందు 'హరిహరాజ.. ' అనే పద్యంలో వాల్మీకిని నన్నయ గురుపద్యవిద్యకు ఆద్యుడు అని కీర్తించారు. తానూ తెలుగులో ఆది కవినని ధ్వనింపజేశారు. ఆంధ్రంలో ఆదికావ్య రచనకు స్వీయ కావ్యప్రణాళికను సిద్ధం చేసుకొని కవితా లక్షణాలను ప్రకటించారు నన్నయ' అని పరిచయ వాక్యాలు రాసి అపుడు కవితా లక్షణాలను విశ్లేషించాలి. ఈ ప్రశ్నలో నన్నయ ఆదికవిగా కీర్తి పొందడానికి కారణాలను కూడా అంతర్లీనంగా చెప్పకపోతే - ఆ ప్రశ్నకు న్యాయ చేకూర్చినట్లు కాదు.
దీన్ని బట్టి ప్రశ్నలో అడిగిన అంశాలను వివరిస్తూ అదే కోణంలో తన సమాధానాన్ని మార్చుకుంటూ రాయాల్సిన అవసరం ఉంటుందన్న విషయం అవగతమవుతుంది.
ఇలా కూడా అడగవచ్చు....
* 'గ్రాంథిక శైలికీ, వ్యావహారిక శైలికీ భేదమేమిటో చెప్పి పరిపాలనా రంగంలో వాడదగిన శైలి, దాని అమలుకు చర్చలేమిటో తెలపండి'
నిజానికి ఈ ప్రశ్న 'అధికార భాషగా తెలుగు' అంశానికి సంబంధించింది. ఎటొచ్చీ - గ్రాంథిక భాష ప్రమాణభాషగా ఒకప్పుడు ఉండేదని, వ్యావహారిక భాషోద్యమ ఫలితంగా వాడుకభాష అమల్లోకి వచ్చిందనీ, అధికార భాషగా పాలనారంగంలో సుబోధకమైన వాడుకభాష వాడాలనీ, దానికి సంబంధించిన చర్యలూ, సమస్యలను తెలుపుతూ జవాబు రాయాలి.
* 'తెలుగుల పుణ్యవేటి అయిన పోతన కలకండ అచ్చులు పోతపోసిన విధంగా రాసిన భాగవత వైశిష్ట్యాన్ని వివరించండి'
ఇది నేరుగా అడిగిన ప్రశ్నకాదు. 'పోతన తెలుగుల పుణ్యవేటి ' అని విశ్వనాథ సత్యనారాయణ పలికారు. '.... అచ్చముగా కలకండ అచ్చులుంపోతలు పోసి ఉండెదము పోతనగారి విధాన...' అని పలికిందీ విశ్వనాథ వారే. శ్రీమద్రామాయణ కల్పవృక్ష అవతారికలో విశ్వనాథ పలికినవి అక్షరసత్యాలు' అంటూ జవాబు ప్రారంభించాలి. ఇందులో భక్తి తత్త్వాన్నీ చెప్పాలి, పోతన కవితాశైలినీ వివరించాలి.
* 'ప్రమాణభాష అంటే ఏమిటో వివరించి మాడలికాలకూ, ప్రమాణభాషకూ గల అనుసంధానాన్ని వివరిస్తూ ఆధునిక తెలుగు సాహిత్యంలో మాండలిక ప్రయోగాన్ని వివరించండి'.
ఇలాంటి ప్రశ్నల విషయంలో కూడా అభ్యర్థి కాస్త నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే చాలు. 'మాండలికాలు అంటే భాషలోని వివిధ వైవిధ్యాలు. వాటిని అధిగమిస్తూ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రజలంతా ఉపయోగించేదే ప్రమాణ భాష' అంటూ ప్రారంభించి ఈ రెండింటి సంబంధాన్ని విశ్లేషించి ఆపై మాండలిక రచనలను గురించి రాయాలి.
*నవ్య సంప్రదాయాన్ని, జాతీయోద్యమాన్ని కలిపి అడగడం, వేమన - పోతులూరి వీరబ్రహ్మంల తత్వాన్ని తులనాత్మకంగా చర్చించండి... లాంటి ప్రశ్నలు కూడా రావొచ్చు.
నిర్వచనాలు తప్పనిసరి!
ఆదాన ప్రదానాలు, అర్థ విపరిణామం, మాండలికాలు, ప్రమాణభాష, ప్రయోగ విస్తృతి, ఆధునికీకరణ, భాషాభివృద్ధి ప్రణాళికలు, జాతీయ భాష, అధికార భాష, అనువాదం - లాంటి పారిభాషిక పదాలకు సరైన నిర్వచనాలు తప్పనిసరిగా అభ్యర్థి నోటికి వచ్చి ఉండాలి. అలాగే ప్రసన్న కథాకలితార్థయుక్తి, చతుర వచోనిధిత్వం, అల్లిక జిగిబిగి, శిరీషకుసుమపేశల సుధామయోక్తులు, అతులిత మాధురీ మహిమ, నవ్యవాచా సరః ప్రాతః పద్మ మరందఖండం, మధుఝరీభ్రామర రుతి... ఇలా వివిధ కవులకు చెందిన విశిష్ట కవితా లక్షణాలేమిటో, వాటిని పేర్కొన్నదెవరో, వాటి విశ్లేషణలేమిటో అభ్యర్థికీ తెలిసి ఉండాలి.
Wednesday, September 9, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment