Wednesday, September 9, 2009

చదివితే చాలదు ప్రాక్టీసు చేయాలి... ఎ.వి.రాజమౌళి, ఐఎఎస్

ఎ.వి.రాజమౌళి... సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి. 1999లో తొలి అటెంప్ట్‌లోనే సివిల్స్ ఇంటర్వ్యూకెళ్ళినా ఆ తర్వాత అనారోగ్యం దృష్ట్యా రెండేళ్ళు గ్యాప్. ఆపై 2003లో 39వ ర్యాంకుతో ఐఎఎస్ సాధించిన ఘనుడు రాజమౌళి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనే సామెతకు మానవ రూపమా అనిపించే వినయశీలత ఆయన సొత్తు. సహృదయత ఆయనకు సహజ అలంకారం. అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుందని ఆయన ఇంటర్వ్యూ మీ కోసం...

ప్ర : తెలుగు లిటరేచర్‌ని తీసుకోవడానికి అభ్యర్థికి కావలసిన ప్రాథమిక లక్షణాలు?

జ : తెలుగు భాషా సాహిత్యాలపై ఆసక్తి, నిశిత పరిశీలన, సాహిత్యాన్ని ఆస్వాదించి, ఆనందించే గుణం, సంయమనంతో కూడిన అభిప్రాయ వ్యక్తీకరణ, చదివిందాన్ని తన సొంత మాటల్లో వ్యక్తీకరించగలిగే నేర్పు, ఓర్పు.

ప్ర: పేపర్-1కి, పేపర్-2కి వ్యత్యాశం ఏమిటి? రెండింటికీ ఎలాంటి వ్యూహం అనుసరించాలి?

జ : పేపరు-1లో సమాధానాలు చాలా వరకూ నిర్దిష్ట నిర్మాణానికి లోబడి ఉంటాయి. పేపరు-2లో సమాధానాలు అభ్యర్థి అవగాహనా సామర్థ్యం, కావ్యపు లోతులను తట్టగలిగే సున్నిత రస హృదయం లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. స్థూలంగా పేపరు-1 తెలుగు సాహిత్య నిర్మాణాల గురించి, పేపరు-2 తెలుగు సాహిత్యంలోని కొన్ని ఆణిముత్యాల్లాంటి పాఠ్యాంశాల గురించి ఉంటాయి. పేపరు-1కి ఉన్న సమాచారాన్ని సమయపాలనకు అనుగుణంగా సమాధానాలు ప్రాక్టీసు చేయటం, పేపరు-2కి పాఠ్యభాగ పఠనం సంయమన పూరిత విశ్లేషణాత్మక మననం అవసరం.

ప్ర: తెలుగు లిటరేచర్‌లో గరిష్ట మార్కులు పొందాలంటే విధానాలు ఏమిటి?

జ : తెలుగు సాహిత్యాన్ని ప్రేమించగలగాలి. ప్రతి పాఠ్యాంశాన్ని నిశిత విమర్శనా దృష్టితో చదువుతూ పుస్తకం లేకుండా మనసులో ఆ పాఠ్యాభాగ అంశాన్ని మననం చేసుకొనే స్థితికి రావాలి. మూల పాఠ్యాంశాన్ని చదివేటప్పుడు ఆయా కవి లేదా కవయిత్రి రాసిన కొన్ని కీలక పద సముదాయాల్ని గుర్తు పెట్టుకొని అభ్యర్థి సమాధానం తన మాటల్లో రాసేటప్పుడు మధ్యలో కవి మాటలను తన అభిప్రాయాలనే సమర్థించే విధంగా ఉటంకించాలి.

ఒక పాఠ్యభాగ అంశం నుండి ఆ కవి లేదా కవయిత్రి కవితా లక్షణాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకు "ఆది కవి నన్నయ రెండవ వాల్మీకి, తిక్కన రెండవ వ్యాసుడు" అనే వాక్యాన్ని విశదీకరించమని అడిగితే ఈ ఇరువురి కవితా లక్షణాల మధ్య, శైలుల మధ్య ఉన్న తేడాను అభ్యర్థి స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. పేపరు-1లోని రెండవ భాగమంతా ప్రధాన కవుల కవయిత్రుల ప్రాథమిక కవితా లక్షణాలను అర్థం చేసుకొనేందుకు ఉద్దేశించినది. అభ్యర్థి ప్రిపరేషన్ సమయంలో ఈ భాగంపై పట్టు కలిగి ఉన్నట్లయితే పేపరు-2లోని ఆయా కవుల పాఠ్యాంశాలపై విమర్శనాత్మక సమాధానాలు రాసేటప్పుడు ఆ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.

క్రమం తప్పకుండా సంక్షిప్త ప్రశ్నలకు, వ్యాసరూప ప్రశ్నలకు, వ్యాఖ్యానాలకు, అడిగిన ప్రశ్నకు ఒకటికి, నాలుగుసార్లు చదివి అర్థం చేసుకొని సమాధానాలు రాయటం ప్రాక్టీసు చేస్తే, ఇది ఒక అలవాటుగా మారి, పరీక్షలలో ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయటం సులభతరం అవుతుంది.

ప్ర: ఏదో ఒక మెటీరియల్ చదివితే సరిపోతుందా? Reference పుస్తకాలు చదవాలా?

జ :
ప్రారంభ దశలో గైడెన్స్ కోసం, ఏదైనా మెటీరియల్ చదివినా, తరవాత రిఫరెన్స్ పుస్తకాలు చదవటం వల్ల అభ్యర్థి అభిప్రాయాల్లో సాంద్రత పెరిగి, విశ్లేషణలోనూ, విమర్శనలోనూ, స్పష్టత, సమగ్రత, సంగ్రహత పుష్కలంగా ఉండే అవకాశం ఉంటుంది.

ప్ర: చదవాలంటే ఏ దృక్కోణం నుంచి చదవాలి? 2nd Paper లోని Textలు తప్పక చదవాలా?

జ : పేపర్-2లోని మూల పాఠ్యభాగాలని తప్పని Text సరిగా చదవాలి. అలా చదివినప్పుడే, అభ్యర్థి సమాధానాలు రాసేటప్పుడు ఆయా కవి / కవయిత్రి వాడిన కొన్ని ప్రముఖ వాక్యాలను, శబ్దాల సమాహారాల్ని అభ్యర్థి తన సమాధానాలలో ఉటంకించే సామర్థ్యం పెరుగుతుంది. Textలు చదివేటప్పుడు కవి అనుసరించిన శిల్పం, పద్య చంధస్సు, అందులో వాడబడ్డ అలంకారాలు, తెలుగు లేదా సంస్కృత పదాలు, ఆయా పాత్రలను వర్ణించటానికి కవి వాడిన విశేషణాలను, ఆయా పాత్రలను చిత్రించిన సందర్భాన్ని అవగాహన చేసుకొనే దృక్కోణంలో నుండి చదవాలి.

ప్ర: పద్యాలు కంఠస్థం చేయాలా? ప్రతి ప్రశ్నకు పద్యాలు తప్పక Quote చేయాలా? అలా చేయాలంటే ప్రశ్నకు కనీసం ఎన్ని Quote చేయాలి?

జ : కవి కవితా లక్షణాలను విశ్లేషించేటప్పుడు అభ్యర్థి తన విశ్లేషణకు మద్దతుగా కొన్ని పద్యాలను ఉటంకించాల్సి వస్తుంది. అలాంటి కొన్ని పద్యాలను కంఠస్తం చేయాలి. అలా ప్రతి ప్రశ్నకు నిర్ధారించిన సంఖ్యలలో పద్యాలను ఉటంకించాలనే (Quote) నియమం లేదు. అవసరాన్ని బట్టి సందర్భోచితంగా ఆ పద సమయాన్ని ఉటంకిస్తూ రాస్తే సమాధానం సహజంగా ఉంటుంది. కృత్రిమంగా అనిపించదు.

ప్ర: వ్యాఖ్యానాలను ఎలా అర్థం చేసుకోవాలి? వ్యాఖ్యానాలను ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి?

జ : వ్యాఖ్యానం రాసేటప్పుడు అది ఏ దృక్కోణం నుంచి అడగబడిందో అని అభ్యర్థి పరిశీలించాలి. ఒకే పద్యాన్ని చారిత్రక విమర్శన దృష్టితో రాయమనచ్చు లేదా మనో వైజ్ఞానిక విమర్శన దృష్టితో రాయమనచ్చు. అడిగిన దృక్కోణం నుంచి వ్యాఖ్యానం రాయటానికి కావలసిన ప్రాథమిక సూత్రాల్ని అభ్యర్థి ముందే ఆకళింపు చేసుకొని ఉండాలి. మూల పాఠ్యాంశాల్ని (Text) చదవటం ద్వారా అడిగిన పద్యం యొక్క సందర్భాన్ని, విశేషాంశాలను, సంపూర్ణ అవగాహనతో రాయటం సాధ్యం అవుతుంది. తాత్పర్యం రాసేటప్పుడు కృతకంగా అనువదించకుండా ఇచ్చిన పద్యానికి, ఆ పద్య సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని స్వతః సంపూర్ణమైన భావాన్ని రాస్తే అది అభ్యర్థి Textను క్షుణ్ణంగా చదివాడనే సంకేతాన్ని పంపుతుంది.

ప్ర: భాషా దోషాలు ఉంటే ప్రమాదమా? ఏ మేరకు ప్రమాదం? నివారణ చర్యలు ఏమిటి?

జ : భాషా దోషాలు ఈ స్థాయిలో క్షమార్హం కాదు. అభ్యర్థి తన చేతి వ్రాత, భాషా దోషాల వంటి విషయంలో తగిన జాగ్రత్త వహించకపోతే అది తన అశ్రద్ధకు సంకేతం. భాషా దోషాలను నివారించుకోవటానికి సమాధానాలు రాసి వాటిని నిపుణుల చేత పరిశీలింపచేస్తే పునరావృతమయ్యే భాషా దోషాలను కనిపెట్టి నివారించేందుకు వీలవుతుంది. అలాగే చేతిరాత అర్థం కాని విధంగా (Illegible) ఉండే వాళ్ళు అక్షరానికి, అక్షరానికి, అలాగే పదానికి, పదానికి, లైనుకు లైనుకు మధ్య దూరం పెంచటం ద్వారా తమ చేతి రాతను చదివేవారికి అర్థం అయ్యేలా చేయవచ్చు.

ప్ర: పేపర్-1లో మంచి మార్కులు పొందేందుకు ఏం చేయాలి?

జ : పేపర్-1లో మంచి మార్కులు పొందాలంటే సిలబస్‌లో పేర్కొన్న అంశాలపై లోతైన అవగాహన కలిగి ఉండాలి. ఇటీవలి కాలంలో ఒకే ప్రశ్నను వాక్య నిర్మాణం మార్చి అడగటం జరుగుతోంది. అభ్యర్థికి ఈ విషయంలో స్పష్టమైన అవగాహన ఉంటే సిలబస్‌లోని అంశంపై ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం రాయవచ్చు. అయితే ఉదాహరణలను ఇచ్చేటప్పుడు తన సొంత ఉదాహరణలు ఇస్తే అభ్యర్థి అవగాహనకు అది సంకేతమవుతుంది. ప్రేపరు-1 పార్టు-ఎలో సమాధానాలు, ఒక నిర్దిష్టమైన నిర్మాణంలో (Structure) ఉంటాయి. అభ్యర్థి చేయవలసిందల్లా ఉన్న సమాచారాన్ని ఇచ్చిన అరగంటలో సమర్థవంతంగా రాయగలగడం. సమయ పాలన విషయంలో మొదటి నుంచి శ్రద్ధ లేకపోతే పరీక్షలో చెల్లించాల్సిన మూల్యం తీవ్రంగా ఉంటుంది. పేపరు-1 పార్టు-బి విషయంలో ఆయా కవుల కవయిత్రుల విశేష లక్షణాలపై దృష్టి సారించి ఒక్కొక్క కవికి / కవయిత్రికి కొన్ని ముఖ్యమైన పాయింట్లు వాటికి మద్దతుగా కొన్ని కావ్య పంక్తులు గుర్తుంచుకొని ఆ విధంగా రాయాలి. లిమిటెడ్‌గా చదవాలా extensiveగా చదవాలా అనేది అభ్యర్థి విజ్ఞత. More you work more you get.

ప్ర: కంఠస్థం చేయాలా? (పద్యాల్ని గురించి కాదు - ప్రశ్నల గురించి) చేయడం ఎంత వరకు కరక్టు?

జ : ప్రశ్నలకు సమాధానం కంఠస్థం చేయటం కొన్ని సమయాలలో అభ్యర్థిని ఇబ్బందులలోకి నెట్టవచ్చు. ప్రశ్న భిన్నంగా అడగబడితే అభ్యర్థి తాను కంఠస్థం చేసిన సమాధానం మూసలోంచి బయటపడటం కష్టమవుతుంది. అప్పటికప్పుడు అడిగిన ప్రశ్నకు అనుగుణంగా సమాధానం తయారు చేసుకోవటం కష్టం కావచ్చు.

No comments:

Post a Comment