Thursday, September 10, 2009

వ్యాఖ్యానంపై పట్టు కోసం...

సివిల్ సర్వీసెస్ తెలుగు లిటరేచర్ పేపర్-2 అనగానే ప్రతి అభ్యర్థికీ చప్పున గుర్తుకొచ్చేది, గుండెను గుభేల్‌మనిపించేది - వ్యాఖ్యానాల విభాగం. పేపర్-2 మొత్తం మార్కులు 300 అయితే 120 మార్కులు కేవలం వ్యాఖ్యానాలకే యుపిఎస్‌సి కేటాయించడం జరిగింది. అంటే రెండు వ్యాసరూప ప్రశ్నలతో సమానమైన విభాగమన్నమాట ఇది. అలాగని రెండు వ్యాసరూప ప్రశ్నలకు ప్రిపేరయినంత సులభంగా వీటికి ప్రిపేరవ్వాలనుకోవడం తెలివితక్కువ పనే అవుతుంది.

పేపర్-2లో పరీక్షలో ప్రాచీన సాహిత్యంతో నాలుగు వ్యాఖ్యానాలు ఇస్తే మూడు వ్యాఖ్యానాలు రాయాల్సి ఉంటుంది; ఒక్కో వ్యాఖ్యానానికి 20 మార్కుల చొప్పున మొత్తం 60. కాగా ఆధునిక సాహిత్యం నుంచి కూడా నాలుగు వ్యాఖ్యానాలకు మూడు రాయాల్సి ఉంటుంది. మొత్తం 60 మార్కులు. ఈ రెండూ అంటే ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు రెండూ కలుపుకొని మొత్తం 120 మార్కులు.

వ్యాఖ్యానం అంటే ?: బ్రౌన్ కూర్చిన తెలుగు - ఇంగ్లీషు నిఘంటువు ప్రకారం - వ్యాఖ్యానం అంటే ఆంగ్ల అర్థం - A commentary, gloss, note, exposition. ఏదైనా ఒక విషయాన్ని సమీక్షించడం ఇందులో అంతర్భాగం. ఒక కవి రాసిన కావ్యాన్ని - ఆ కావ్యం యొక్క సౌందర్యాన్ని, ఆ కావ్య రచనకు గల నేపథ్యాన్ని - ఆ కావ్య కర్త యొక్క అనుభవం ఆ కావ్యంలో ప్రతిఫలించిన తీరును ఇలా ప్రతి ఒక్క అంశాన్ని విశ్లేషించడం ఇందులో కనిపిస్తుంది.

వ్యాఖ్యానం అంటే Interpretation అని కూడా చెప్పుకోవచ్చు. "మంచి కవిత్వంలో కవి ప్రతిభ చేత ధ్వనించే అర్థాన్ని విమర్శకుడు గ్రహించి దానిని పాఠకులకు వివరించడమే 'వ్యాఖ్యానం'. కవిత్వంలో శబ్దార్థం కన్న, వాచ్యార్థం కన్న వ్యంగ్యార్థం అధికంగా కనిపిస్తుంది. ఈ కారణంగా వ్యాఖ్యానం అవసరం ఎంతో ఉంటుంది. అంటే కవి పైకి కొన్ని చెబుతున్నా - ఆ పైకి చెబుతున్న విషయం వెనుక లోలోపల నిగూఢంగా సామాన్య పాఠకుడికి సులభంగా అర్థం కాని అంశాల్ని ఇముడుస్తూ ఉంటాడు. వాటిని పాఠకుడికి తెలియచెప్పడం విమర్శకుడు చేసే పని. అందుకే "కవి కప్పి చెబుతాడు విమర్శకుడు విప్పి చెబుతాడు" అని అంటారు.

అలాగని వ్యాఖ్యానం అంటే - కవి చెప్పని అంశాల్ని, కవి ఉద్దేశానికి విరుద్ధంగా ఉన్న అంశాల్ని, కవి పరిస్థితికి అందుబాటులో లేని అంశాల్ని వ్యాఖ్యాత ఏవేవో ఊహించి రాయడం సరైన వ్యాఖ్యానం అనిపించుకోదు. వ్యాఖ్యానం వల్ల పాఠకులు రచనను పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. రచయిత ఉద్దేశించిన అర్థాన్ని విమర్శకుడు వ్యాఖ్యానాల్లో ప్రకటించడం జరుగుతుంది.

వ్యాఖ్యానం విమర్శ యొక్క తొలి రూపాల్లో ఒకటి. వ్యాఖ్యానం కేవలం శబ్దార్థ తాత్పర్యాలనే కాదు, కావ్య పరమార్థాన్ని కూడా తెలుపుతుంది. తెలపాలి కూడా ! ప్రాచీన అలంకారికులు వ్యాఖ్యాన లక్షణాలను ఇలా వివరించారు -

* వదాల అర్థాన్ని వివరించడం

* సమాస పదాలలోని నిగూఢ అర్థాల్ని విప్పి చెప్పడం

* కావ్యంలోని అలంకారాల్ని సమన్వయించి చూపడం

* వ్యాకరణ సంబంధమైన అంశాల్ని వివరించడం

అయితే ఇవి కేవలం కావ్యం యొక్క సౌందర్యానికి, కావ్య శరీరానికి, కావ్యపు ఆత్మగతమైన ధ్వని, అలంకారాలు తదితర అంశాలకు మాత్రమే పరిమితమైన లక్షణాలుగా గుర్తించాలి. యు.పి.ఎస్.సి. తెలుగు లిటరేచర్ సిలబస్ ప్రకారం చూస్తే పై అంశాలు 'కళా సౌందర్యాత్మక' దృక్పథం కిందకు వస్తాయి.

No comments:

Post a Comment